Sri #PawanKalyan Full Speech on the occasion of PM Sri Modi ji lays foundation stone in Amaravati
‘గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అమరావతి రైతులు ఎన్నో ఇబ్బందులుపడ్డారు. లాఠీ దెబ్బలు తిన్నారు. చరిత్రలో నిలిచిపోయే పోరాటం చేశారు. ఈ ఉద్యమంలో మహిళా రైతులు చేసిన పోరాటం మరిచిపోలేనిది. అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉంటుందని ఆనాడు చెప్పాం. ఇచ్చిన మాటకు కట్టుబడి మళ్లీ గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారితో రాజధాని పనులు పునఃప్రారంభం చేసుకుంటున్నామ’ని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం అమరావతి భవిష్యత్తును, ప్రజల ఆకాంక్షలను దివిసీమ ఉప్పెన మాదిరి తుడిచి పెట్టాలని చూసింది.. అయితే ధర్మ యుద్ధంలో అమరావతి రైతులు, రాష్ట్ర ప్రజలు విజయం సాధించారని అన్నారు. అమరావతి ప్రపంచ స్థాయి సర్వ శ్రేష్ఠ రాజధానిగా ఆవిర్భవిస్తుందని, ఒక ఆర్కిటక్చరల్ జోన్... ఒక కాంక్రీట్ జంగిల్ గా మిగిలిపోకుండా జవాబుదారీతనం, ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. రాజధాని రైతులు భూములు మాత్రమే ఇవ్వలేదు.. రాష్ట్రానికి ఒక భవిష్యత్ ఇచ్చారని కొనియాడారు. పెహల్గాం ఉగ్రదాడి లాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ రాజధాని పున: నిర్మాణ పనులు ప్రారంభించేందుకు సమయం ఇచ్చిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలిపారు.
"అమరావతి పున: ప్రారంభం సందర్భంగా రాజధాని నిర్మాణానికి 34 వేల ఎకరాల భూములు ఇచ్చిన 29 వేల పైచిలుకు రైతులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. గత ఐదేళ్లుగా అమరావతి రైతులు రోడ్ల మీదకు వచ్చి, ముళ్ల కంచెల మధ్య కూర్చుని, మానసికంగా నలిగిపోయి, పోలీసులు లాఠీల దెబ్బలు తిని, కేసులు పెట్టించుకున్నారు. రెండు వేల పైచిలుకు మంది ప్రాణాలు కోల్పోయారు. ఉద్యమ సమయంలో నా దగ్గరకి వచ్చిన మహిళా రైతులు మా కన్నీరు తుడిచేవారు ఉన్నారా? అని అడిగారు. మా బాధలు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి తెలుస్తాయా? అని అడిగారు. శ్రీ మోదీ గారికి తెలియని అంశం ఏమీ ఉండదు. అమరావతే ఆంధ్రప్రదేశ్ కు శాశ్వత రాజధాని అని ఆ రోజున మాటిచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజున ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా రాజధాని నిర్మాణం పున: ప్రారంభం కాబోతోంది. జగద్గురువు శ్రీ ఆది శంకరాచార్య 1237వ జయంతి రోజున అమరావతి పనులు పున: ప్రారంభం కాబోతుండడం ఆనందాన్ని కలుగచేస్తోంది. అమరావతి ఐదు కోట్ల మంది ప్రజలకు హబ్. ఇది మనందరి ఇల్లు. ప్రధాన మంత్రి గారు గతంలో సన్యాసాశ్రమంలో ఉన్న సమయంలో ఆయనకు అనికేత్ అని పేరు పెట్టారు. అనికేత్ అంటే ఇల్లు, కుటుంబం లేని పరమ శివుడు అని అర్ధం. అలాంటి ఇల్లు, కుటుంబం లేని ఆయన ఐదు కోట్ల మంది ప్రజల కోసం, ఇన్ని కోట్ల కుటుంబాల కోసం రాజధాని నిర్మాణాన్ని బాధ్యత తీసుకుని ఇక్కడికి వచ్చారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కామాఖ్య నుంచి ద్వారక వరకు దేశాన్ని తన కుటుంబంగా చేసుకుని అమరావతి పున: ప్రారంభానికి విచ్చేసిన శ్రీ మోదీ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, అమరావతి రైతుల తరఫున చేతులెత్తి నమస్కరిస్తున్నాను.
• గత పాలకులు... అమరావతి అంటే పరదాలు గుర్తుకు వచ్చేలా చేశారు
గత పాలకులు అమరావతి అంటే పరదాలు, సెక్షన్ 30, సెక్షన్ 144 మాత్రమే గుర్తుకు వచ్చేలా చేశారు. నువ్వు ధర్మం కోసం నిలబడితే ధర్మం నిన్ను నిలబడేలా చేస్తుందనేలా అమరావతి రైతులు, రాష్ట్ర ప్రజలు ధర్మ యుద్ధంలో విజయం సాధించారు. 33 వేల ఎకరాల భూమిని త్యాగం చేసిన రైతుల సంకల్ప ఫలితంగా ఈ రోజున రాష్ట్ర రాజధాని ఆవిర్భవించింది. రాజధాని తరలిపోతుందన్న సమయంలో ఐదు కోట్ల ప్రజల తరఫున రోడ్ల మీదకు వచ్చి రైతులు, మహిళలు, విద్యార్ధులు చేసిన పోరాటం, పడిన అవమానాలు, వారిపై పడిన గాయాలు ప్రతి ఒక్కటీ మా మనసులో ఉన్నాయి. ఆనాడు దివ్యాంగులపై పడిన లాఠీ దెబ్బలు నా గుండెల్లో ఇంకా సజీవంగా ఉన్నాయి. ఆ బాధలు నేను ఇంకా మరిచిపోలేదు. ఎవ్వరినీ మరిచిపోనివ్వను. ఆ రైతులు పడిన బాధలు, త్యాగాలకు సజీవ సాక్ష్యమే నేడు పున: ప్రారంభానికి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి రాక. వారి త్యాగాలు మా మనసులో ఉన్నాయి. వారు చేసిన త్యాగాలకు కూటమి జవాబుదారీగా ఉంటుంది. బాధ్యతగా అమరావతి నిర్మాణం పూర్తి చేసేలా కృషి చేస్తుంది. గత ప్రభుత్వం ఐదేళ్లలో అమరావతి రైతులు చేసిన త్యాగాలను అవమానపరిచింది. మూడు రాజధానులనే అస్తవ్యస్త విధానంతో అగౌరవపరిచింది. మేమంతా మీకు హామీ ఇస్తున్నాం. అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా ఆవిర్భవిస్తుంది.
• ఇచ్చిన ప్రతి హామీని దశలవారీగా అమలు చేస్తున్నాం
కేంద్రంలో, రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడిన కారణంగా రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు దశల వారీగా, బాధ్యతాయుతంగా అమలు చేస్తున్నాం. గత ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వని కారణంగా రాష్ట్రం.. కేంద్రం నుంచి పొందాల్సిన వేల కోట్ల రూపాయిలు నష్టపోయింది. ప్రస్తుత ప్రభుత్వాలు కో ఆపరేటివ్ ఫెడ్ సంస్కృతితో, పరస్పర సహకారంతో పని చేస్తున్నాయి. ఈ రోజున రైల్వే, పారిశ్రామిక, రహదారులు, రక్షణకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా లక్షా ఏడు వేల కోట్ల రూపాయిల విలువైన అభివృద్ధి పనులకు శ్రీ మోదీ గారు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారు. రాయలసీమలో గుంతకల్ రేల్వే, గోరంట్ల హైవే లాంటి కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి. అవనిగడ్డ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా మనమంతా ఆశించిన విధంగా మిస్సైల్ టెస్ట్ రేంజ్ కి శంకుస్థాపన జరగడం ఆనందంగా ఉంది.
• క్లిష్ట సమయంలో మన కోసం వచ్చిన ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు
గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారిని మనమంతా లోతుగా అర్థం చేసుకోవాలి. కశ్మీర్ లో ఉగ్రవాదులు 26 మందిని చంపేసిన క్లిష్ట సమయంలో, దేశం యుద్ధం వైపు అడుగులు వేస్తున్న కీలక సమయంలో ఆ భారాన్ని, బరువుని గుండెల్లో పెట్టుకుని, వేదనతో ఉండి కూడా అమరావతి రైతులు చేసిన త్యాగాలను మరవకుండా ఇక్కడికి వచ్చారు. పెహల్గాం ఉగ్రదాడి దేశ చరిత్రలో ఒక చీకటి అధ్యాయం. బాధితుల రోదనలు వింటే ఎంతో బాధ కలిగింది. పెహల్గాం దాడి దేశం మొత్తం మీద జరిగిన దాడి. ఇలాంటి క్లిష్ట సమయంలో కూడా సమయం ఇచ్చి అమరావతికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియచేస్తున్నా అన్నారు.
#JanaSenaParty #PawanKalyan #DeputyCM